కీర్తనలు 33:1-22
33 నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందంతో కేకలు వేయండి.+
నిజాయితీ గలవాళ్లు ఆయన్ని స్తుతించడం సరైనది.
2 వీణతో* యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి;పది తంతుల వాద్యంతో ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి.*
3 ఆయనకు ఒక కొత్త పాట పాడండి;+ఆనందంతో కేకలు వేస్తూ తంతుల్ని నైపుణ్యంగా వాయించండి.
4 ఎందుకంటే, యెహోవా మాట సత్యమైనది,+ఆయన చేసేవన్నీ నమ్మదగినవి.
5 ఆయన నీతిన్యాయాల్ని ప్రేమిస్తాడు.+
భూమి యెహోవా విశ్వసనీయ ప్రేమతో నిండివుంది.+
6 యెహోవా మాటతో ఆకాశం చేయబడింది,+ఆయన నోటి ఊపిరితో* దానిలోని ప్రతీది* చేయబడింది.
7 ఆయన సముద్రం నీళ్లను ఆనకట్టలా పోగుచేస్తాడు;+ఉప్పొంగే జలాల్ని గోదాముల్లో ఉంచుతాడు.
8 భూమంతా యెహోవాకు భయపడాలి.+
భూనివాసులు ఆయన్ని బట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వాలి.
9 ఆయన మాట అన్నాడు, అవి ఉనికిలోకి వచ్చాయి;+ఆయన ఆజ్ఞాపించాడు, అవి స్థిరపర్చబడ్డాయి.+
10 యెహోవా దేశాల కుట్రల్ని* భగ్నం చేశాడు;+దేశదేశాల ప్రజల ప్రణాళికల్ని* పాడు చేశాడు.+
11 కానీ యెహోవా నిర్ణయాలు* ఎప్పటికీ నిలుస్తాయి;+ఆయన హృదయాలోచనలు తరతరాలు ఉంటాయి.
12 యెహోవా దేవునిగా ఉన్న దేశం,తన సొత్తుగా ఆయన ఎంచుకున్న ప్రజలు+ సంతోషంగా ఉంటారు.+
13 యెహోవా పరలోకం నుండి కిందికి చూస్తాడు;ఆయన మనుషులందర్నీ గమనిస్తాడు.+
14 ఆయన తన నివాస స్థలం నుండిభూనివాసుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు.
15 అందరి హృదయాల్ని చేసేది ఆయనే;ఆయన వాళ్ల పనులన్నిటినీ పరిశీలిస్తాడు.+
16 కేవలం పెద్ద సైన్యం వల్ల రాజు,గొప్ప శక్తి వల్ల వీరుడు రక్షించబడడు.+
17 గుర్రంతో విజయం* లభిస్తుందని అనుకోకు, అది నిన్ను మోసం చేస్తుంది;+దాని గొప్ప బలంతో అది రౌతును తప్పించలేదు.
18 ఇదిగో! యెహోవా కళ్లు తన పట్ల భయభక్తులుగల వాళ్లను,తన విశ్వసనీయ ప్రేమ కోసం ఎదురుచూస్తున్న వాళ్లను గమనిస్తాయి;+
19 మరణం నుండి వాళ్లను రక్షించడానికి,కరువు సమయంలో వాళ్లను సజీవంగా ఉంచడానికి+ ఆయన అలా గమనిస్తాడు.
20 మనం యెహోవా కోసం కనిపెట్టుకొని ఉన్నాం.
ఆయనే మన సహాయకుడు, మన డాలు.+
21 ఆయన్ని బట్టి మన హృదయాలు ఉల్లసిస్తున్నాయి,ఎందుకంటే, మనం ఆయన పవిత్రమైన పేరు మీద నమ్మకం పెట్టుకున్నాం.+
22 యెహోవా, మేము నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాం,+అలాగే నీ విశ్వసనీయ ప్రేమ మా మీద ఎప్పటికీ ఉండాలి.+
అధస్సూచీలు
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ లేదా “సంగీతం వాయించండి.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “దాని సైన్యమంతా.”
^ లేదా “ఆలోచనల్ని.”
^ లేదా “సలహాను.”
^ లేదా “ఆలోచనలు.”
^ లేదా “రక్షణ.”