మత్తయి సువార్త 2:1-23

  • జ్యోతిష్యులు రావడం (1-12)

  • ఐగుప్తుకు పారిపోవడం (13-15)

  • హేరోదు మగపిల్లల్ని చంపిస్తాడు (16-18)

  • నజరేతుకు తిరిగిరావడం (19-23)

2  హేరోదు*+ రాజుగా పరిపాలిస్తున్న రోజుల్లో, యూదయలోని బేత్లెహేములో+ యేసు పుట్టిన తర్వాత, ఇదిగో! తూర్పు నుండి జ్యోతిష్యులు యెరూషలేముకు వచ్చి,  “యూదుల రాజుగా+ పుట్టిన బాబు ఎక్కడున్నాడు? మేము తూర్పున ఉన్నప్పుడు ఆయన నక్షత్రాన్ని చూశాం; ఆయనకు వంగి నమస్కారం చేయాలని వచ్చాం” అని అన్నారు.  ఆ మాట వినగానే హేరోదు రాజు ఆందోళనపడ్డాడు, యెరూషలేము అంతటా కలకలం మొదలైంది.  అప్పుడు అతను ముఖ్య యాజకుల్ని, శాస్త్రుల్ని అందర్నీ ఒక దగ్గరికి పిలిపించి, క్రీస్తు* ఎక్కడ పుడతాడని వాళ్లను అడిగాడు.  వాళ్లు అతనితో ఇలా అన్నారు: “యూదయలోని బేత్లెహేములో;+ ఎందుకంటే ఒక ప్రవక్త ఇలా రాశాడు:  ‘యూదా దేశంలోని బేత్లెహేమా, యూదా అధిపతుల దృష్టిలో నువ్వు ప్రాముఖ్యతలేని నగరానివి ఎంతమాత్రం కావు; ఎందుకంటే నీలో నుండి ఒక పరిపాలకుడు వస్తాడు, ఆయన నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తాడు.’ ”+  అప్పుడు హేరోదు రహస్యంగా ఆ జ్యోతిష్యుల్ని పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన సమయం గురించి వాళ్లను జాగ్రత్తగా అడిగి తెలుసుకున్నాడు.  వాళ్లను బేత్లెహేముకు పంపిస్తూ, “మీరు వెళ్లి, ఆ బాబు కోసం జాగ్రత్తగా వెదకండి. ఆయన కనబడినప్పుడు, వచ్చి నాకు చెప్పండి. అప్పుడు నేను కూడా వెళ్లి ఆయనకు వంగి నమస్కారం చేస్తాను” అన్నాడు.  వాళ్లు రాజు చెప్పిన మాటలు విని, తమ దారిన తాము వెళ్లిపోయారు. అప్పుడు ఇదిగో! వాళ్లు తూర్పున ఉన్నప్పుడు చూసిన నక్షత్రం+ వాళ్లకు ముందుగా వెళ్తూ, ఆ పిల్లవాడు ఉన్న ఇంటి మీద ఆగింది. 10  ఆ నక్షత్రం ఆగడం చూసి వాళ్లు చాలా సంతోషించారు. 11  వాళ్లు ఇంట్లోకి వెళ్లి, ఆ పిల్లవాడు తన తల్లి మరియ దగ్గర ఉండడం చూసి ఆయనకు వంగి నమస్కారం చేశారు. తర్వాత తమ పెట్టెలు తెరిచి బంగారం, సాంబ్రాణి, బోళం ఆయనకు కానుకలుగా ఇచ్చారు. 12  అయితే హేరోదు దగ్గరికి తిరిగెళ్లొద్దని దేవుడు కలలో వాళ్లను హెచ్చరించడంతో,+ వాళ్లు ఇంకో దారిలో తమ దేశానికి బయల్దేరారు. 13  వాళ్లు వెళ్లిపోయిన తర్వాత, ఇదిగో! యెహోవా* దూత యోసేపుకు కలలో కనిపించి+ ఇలా చెప్పాడు: “నువ్వు లేచి పిల్లవాణ్ణి, తల్లిని తీసుకుని ఐగుప్తుకు* పారిపో. నేను చెప్పేంతవరకు అక్కడే ఉండు. ఎందుకంటే పిల్లవాణ్ణి చంపాలని హేరోదు ఆయన కోసం వెదకబోతున్నాడు.” 14  కాబట్టి యోసేపు లేచి రాత్రికిరాత్రే పిల్లవాణ్ణి, మరియను తీసుకుని ఐగుప్తుకు వెళ్లిపోయాడు. 15  హేరోదు చనిపోయేవరకు అతను అక్కడే ఉండిపోయాడు. “నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచాను” అని యెహోవా* తన ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరడానికి అలా జరిగింది.+ 16  జ్యోతిష్యులు తనను మోసం చేశారని హేరోదుకు అర్థమైనప్పుడు అతనికి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో జ్యోతిష్యుల నుండి తాను జాగ్రత్తగా తెలుసుకున్న సమయాన్ని బట్టి+ అతను మనుషుల్ని పంపించి బేత్లెహేములో, దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో రెండు సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయసున్న మగపిల్లలందర్నీ చంపించాడు. 17  దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు అప్పుడు నెరవేరాయి: 18  “రామాలో ఏడ్పు, ఎంతో రోదన వినిపించాయి. రాహేలు+ తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది, వాళ్లు ఇక లేకపోవడంతో ఆమెను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు.”+ 19  హేరోదు చనిపోయినప్పుడు, ఇదిగో! యెహోవా* దూత ఐగుప్తులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి+ 20  ఇలా చెప్పాడు: “నువ్వు లేచి పిల్లవాణ్ణి, తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్లు. ఎందుకంటే పిల్లవాని ప్రాణం తీయాలని చూసినవాళ్లు చనిపోయారు.” 21  అప్పుడు అతను లేచి పిల్లవాణ్ణి, మరియను తీసుకుని ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశించాడు. 22  అయితే హేరోదు స్థానంలో అతని కుమారుడు అర్కెలాయు యూదయను పరిపాలిస్తున్నాడని విన్నప్పుడు యోసేపు అక్కడికి* వెళ్లడానికి భయపడ్డాడు. అంతేకాదు, దేవుడు కూడా కలలో అతన్ని హెచ్చరించాడు.+ దాంతో యోసేపు గలిలయ ప్రాంతానికి వెళ్లి+ 23  అక్కడ నజరేతు అనే నగరంలో స్థిరపడ్డాడు.+ “ఆయన ఒక నజరేయుడు* అని పిలవబడతాడు” అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరడానికి అలా జరిగింది.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “మెస్సీయ; అభిషిక్తుడు.”
అనుబంధం A5 చూడండి.
లేదా “ఈజిప్టుకు.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అంటే, యూదయకు.
“మొలక” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చివుండవచ్చు.