యోహాను సువార్త 15:1-27
15 “నేను నిజమైన ద్రాక్షచెట్టును, నా తండ్రి వ్యవసాయదారుడు.
2 నాలోని ఫలించని ప్రతీ తీగను ఆయన తెంచి పారేస్తాడు; అంతేకాదు ఫలించే ప్రతీ తీగ ఇంకా ఎక్కువగా ఫలించేలా దాన్ని శుభ్రం చేస్తాడు.+
3 నేను మీతో అన్న మాటను బట్టి మీరు ఇప్పటికే శుభ్రంగా ఉన్నారు.+
4 ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉండండి, అప్పుడు నేను కూడా మీతో ఎప్పుడూ ఐక్యంగా ఉంటాను. ద్రాక్షచెట్టుకు అంటుకొని ఉంటే తప్ప తీగ దానంతటదే ఫలించలేదు. అలాగే మీరు కూడా నాతో ఐక్యంగా ఉంటే తప్ప ఫలించలేరు.+
5 నేను ద్రాక్షచెట్టును, మీరు తీగలు. ఎవరైతే నాతో ఎప్పుడూ ఐక్యంగా ఉంటారో, ఎవరితోనైతే నేను ఎప్పుడూ ఐక్యంగా ఉంటానో అతను ఎక్కువగా ఫలిస్తాడు; నా నుండి వేరైపోయి మీరు అసలు ఏమీ చేయలేరు.
6 ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉండని వ్యక్తి, బయట పారేయబడి ఎండిపోయిన తీగలా ఉంటాడు. ప్రజలు ఆ తీగల్ని పోగుచేసి మంటల్లో వేస్తారు, అవి కాలిపోతాయి.
7 మీరు ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉంటే, అలాగే నా మాటలు ఎప్పుడూ మీలో ఉంటే మీకు ఇష్టమైనది ఏది అడిగినా దాన్ని పొందుతారు.+
8 మీరు ఎక్కువగా ఫలిస్తూ నా శిష్యులని నిరూపించుకుంటే నా తండ్రికి మహిమ వస్తుంది.+
9 తండ్రి నన్ను ప్రేమిస్తున్నట్టే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను; నా ప్రేమలో నిలిచి ఉండండి.*
10 నేను తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్టే, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలిచి ఉంటారు.
11 “నాకున్న సంతోషమే మీలో ఉండాలని, మీరు ఆ సంతోషాన్ని పూర్తిగా అనుభవించాలని ఈ విషయాలు మీకు చెప్పాను.+
12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇదే నా ఆజ్ఞ.+
13 స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు.+
14 నేను మీకు ఆజ్ఞాపిస్తున్న వాటిని చేస్తే మీరు నా స్నేహితులుగా ఉంటారు.+
15 ఇప్పటినుండి నేను మిమ్మల్ని దాసులని పిలవను, ఎందుకంటే యజమాని ఏం చేస్తాడో దాసునికి తెలీదు. అయితే నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను, ఎందుకంటే నా తండ్రి దగ్గర విన్న వాటన్నిటినీ నేను మీకు తెలియజేశాను.
16 మీరు నన్ను ఎంచుకోలేదు. కానీ మీరు ఫలిస్తూ ఉండాలని, మీ ఫలం ఎప్పటికీ ఉండాలని నేనే మిమ్మల్ని ఎంచుకున్నాను. దానివల్ల, మీరు నా పేరున తండ్రిని ఏది అడిగినా ఆయన దాన్ని మీకు ఇస్తాడు.
17 “మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు ఈ విషయాలు ఆజ్ఞాపిస్తున్నాను.+
18 లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, అది మీకన్నా ముందు నన్ను ద్వేషించిందని గుర్తుంచుకోండి.+
19 మీరు లోకానికి చెందినవాళ్లయితే, మీరు తనవాళ్లు కాబట్టి లోకం మిమ్మల్ని ఇష్టపడుతుంది. కానీ మీరు లోకానికి చెందినవాళ్లు కాదు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఎంచుకున్నాను కాబట్టే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.+
20 దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడని నేను మీతో అన్న మాట గుర్తుపెట్టుకోండి. వాళ్లు నన్ను హింసించారంటే మిమ్మల్ని కూడా హింసిస్తారు;+ నా మాటలు పాటించారంటే మీ మాటలు కూడా పాటిస్తారు.
21 అయితే మీరు నా శిష్యులు కాబట్టి* వాళ్లు ఇవన్నీ మీకు చేస్తారు; ఎందుకంటే నన్ను పంపించిన వ్యక్తి వాళ్లకు తెలీదు.+
22 నేను వచ్చి వాళ్లకు బోధించకపోయుంటే, వాళ్లమీద ఏ పాపం ఉండేదికాదు. అయితే ఇప్పుడు వాళ్లు తమ పాపానికి సాకులు చెప్పలేరు.
23 నన్ను ద్వేషించే వ్యక్తి నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు.+
24 ఎవరూ చేయని అద్భుతాల్ని నేను వాళ్ల మధ్య చేసుండకపోతే వాళ్లమీద ఏ పాపం ఉండేది కాదు;+ కానీ ఇప్పుడు వాళ్లు నన్ను చూశారు, నన్నూ నా తండ్రినీ ద్వేషించారు.
25 ‘ఏ కారణం లేకుండా వాళ్లు నన్ను ద్వేషించారు’ అని వాళ్ల ధర్మశాస్త్రంలో రాయబడివున్న మాట నెరవేరడానికి అలా జరిగింది.+
26 తండ్రి దగ్గర నుండి నేను మీకు ఒక సహాయకుణ్ణి, అంటే సత్యాన్ని వెల్లడిజేసే పవిత్రశక్తిని పంపిస్తాను;+ తండ్రి నుండి వచ్చే ఆ సహాయకుడు నా గురించి సాక్ష్యమిస్తాడు.+
27 అలాగే మీరు మొదటినుండి నాతోపాటు ఉన్నారు కాబట్టి మీరు కూడా నా గురించి సాక్ష్యమివ్వాలి.+