లూకా సువార్త 21:1-38
21 యేసు కానుక పెట్టెల వైపు చూస్తున్నప్పుడు, ధనవంతులు తమ కానుకలు వాటిలో వేయడం గమనించాడు.+
2 అప్పుడు ఒక పేద విధవరాలు చాలా తక్కువ విలువగల రెండు చిన్న నాణేలు* వేయడం చూసి
3 ఆయనిలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, వాళ్లందరి కన్నా ఈ పేద విధవరాలే ఎక్కువ వేసింది.+
4 ఎందుకంటే వాళ్లందరూ తమ సంపదల్లో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె ఎంతో అవసరంలో* ఉన్నా, బ్రతకడానికి తన దగ్గర ఉన్నదంతా వేసేసింది.”+
5 తర్వాత, ఆలయం మంచిమంచి రాళ్లతో, ప్రతిష్ఠిత వస్తువులతో అలంకరించబడి ఉండడం గురించి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు+
6 యేసు ఇలా అన్నాడు: “మీరు వీటిని చూస్తున్నారు కదా, రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడే రోజులు వస్తాయి.”+
7 అప్పుడు వాళ్లు, “బోధకుడా, ఇవి నిజంగా ఎప్పుడు జరుగుతాయి? ఇవి జరిగే సమయం దగ్గరపడిందని తెలుసుకోవడానికి సూచన ఏమిటి?” అని ఆయన్ని అడిగారు.+
8 ఆయన ఇలా చెప్పాడు: “మీరు మోసపోకుండా చూసుకోండి.+ ఎందుకంటే చాలామంది నా పేరుతో వచ్చి, ‘నేనే ఆయన్ని’ అనీ, ‘ఆ సమయం దగ్గరపడింది’ అనీ అంటారు. వాళ్ల వెనక వెళ్లకండి.
9 అంతేకాదు, మీరు యుద్ధాల గురించి, అల్లకల్లోల పరిస్థితుల* గురించి విన్నప్పుడు భయపడకండి. ఎందుకంటే ముందు ఇవన్నీ జరగాలి, కానీ అంతం వెంటనే రాదు.”+
10 తర్వాత ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి.+
11 తీవ్రమైన భూకంపాలు వస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, పెద్దపెద్ద అంటువ్యాధులు* వస్తాయి.+ భయంకరమైన దృశ్యాలు, ఆకాశంలో గొప్ప సూచనలు కనిపిస్తాయి.
12 “అయితే ఇవన్నీ జరగకముందు ప్రజలు మిమ్మల్ని పట్టుకొని, హింసించి,+ సమాజమందిరాలకు అప్పగిస్తారు; చెరసాలల్లో వేయిస్తారు. నా శిష్యులుగా ఉన్నందుకు మిమ్మల్ని రాజుల ముందుకు, అధిపతుల ముందుకు తీసుకెళ్తారు.+
13 దానివల్ల, సాక్ష్యమిచ్చే అవకాశం మీకు దొరుకుతుంది.
14 కాబట్టి వాళ్లకు ఎలా జవాబివ్వాలో ముందే ఆలోచించి పెట్టుకోకూడదని మీ హృదయాల్లో నిశ్చయించుకోండి.
15 మీ వ్యతిరేకులందరు కలిసినా ఎదిరించలేని, తిప్పికొట్టలేని తెలివిని, మాటల్ని నేను మీకు ఇస్తాను.+
16 అంతేకాదు చివరికి మీ అమ్మానాన్నలు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులే మిమ్మల్ని అప్పగిస్తారు.* మీలో కొందరు చంపబడతారు.+
17 మీరు నా శిష్యులుగా ఉన్నందుకు ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.+
18 అయితే మీ తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించిపోదు.+
19 మీ సహనం వల్ల మీరు మీ ప్రాణాలు రక్షించుకుంటారు.+
20 “అయితే, యెరూషలేమును సైన్యాలు చుట్టుముట్టడం+ మీరు చూసినప్పుడు, దాని నాశనం దగ్గరపడిందని తెలుసుకోండి.+
21 అప్పుడు యూదయలో ఉన్నవాళ్లు కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి;+ దాని మధ్య ఉన్నవాళ్లు అక్కడి నుండి వెళ్లిపోవాలి; గ్రామాల్లో ఉన్నవాళ్లు దానిలోకి వెళ్లకూడదు.
22 ఎందుకంటే రాయబడినవన్నీ నెరవేరేలా, అవి న్యాయాన్ని అమలుచేసే రోజులు.*
23 ఆ రోజుల్లో గర్భిణులకు, పాలిచ్చే స్త్రీలకు శ్రమ!+ ఎందుకంటే అప్పుడు ఈ దేశం మీద పెద్ద కష్టం వచ్చిపడుతుంది; ఈ ప్రజల మీదికి శిక్ష వస్తుంది.
24 కొంతమంది కత్తితో చంపబడతారు, ఇంకొంతమంది వేరే* దేశాలకు బందీలుగా తీసుకెళ్లబడతారు;+ అన్యజనులకు నిర్ణయించిన కాలాలు పూర్తయ్యేవరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుతుంది.+
25 “అంతేకాదు సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు కనిపిస్తాయి;+ భూమ్మీదేమో సముద్ర తరంగాల ఘోష వల్ల, దానిలోని అల్లకల్లోలం వల్ల ఎలా తప్పించుకోవాలో తెలియక దేశాలకు తీవ్రమైన వేదన కలుగుతుంది.
26 ప్రజలు భయం వల్ల, లోకం మీదికి రాబోతున్నవాటి గురించి ఎదురుచూడడం వల్ల సొమ్మసిల్లుతారు. ఎందుకంటే ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి.
27 అప్పుడు మానవ కుమారుడు+ శక్తితో, గొప్ప మహిమతో మేఘంలో రావడం వాళ్లు చూస్తారు.+
28 అయితే ఇవి జరగడం మొదలైనప్పుడు మీరు స్థిరంగా నిలబడి మీ తలలు ఎత్తుకోండి; ఎందుకంటే మీ విడుదల దగ్గరపడుతోంది.”
29 తర్వాత ఆయన వాళ్లకు ఈ ఉదాహరణ* చెప్పాడు: “అంజూర చెట్టును, మిగతా చెట్లన్నిటినీ గమనించండి.+
30 వాటికి చిగురు రావడం చూసినప్పుడు, ఎండాకాలం రాబోతుందని మీ అంతట మీరే గ్రహిస్తారు.
31 అదేవిధంగా, ఈ విషయాలు జరగడం మీరు చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరపడిందని తెలుసుకోండి.
32 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ తరం అస్సలు గతించిపోదు.
33 ఆకాశం, భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఎప్పటికీ నిలిచివుంటాయి.
34 “మీ విషయంలో శ్రద్ధ తీసుకోండి. అతిగా తినడం వల్ల, అతిగా తాగడం వల్ల,+ జీవిత చింతల వల్ల+ మీ హృదయాలు ఎన్నడూ ఉక్కిరిబిక్కిరి కాకుండా చూసుకోండి. లేకపోతే ఆ రోజు అకస్మాత్తుగా ఒక ఉచ్చులా మీ మీదికి వస్తుంది.+
35 ఎందుకంటే అది భూమంతటా ఉన్న వాళ్లందరి మీదికి వస్తుంది.
36 కాబట్టి, జరగాల్సిన వీటన్నిటినీ తప్పించుకొని మానవ కుమారుడి ముందు నిలబడగలిగేలా మీరు ఎప్పుడూ పట్టుదలగా ప్రార్థిస్తూ,+ మెలకువగా ఉండండి.”+
37 ఆయన పగటిపూట ఆలయంలో బోధించేవాడు, రాత్రిపూట అక్కడి నుండి వెళ్లి ఒలీవల కొండ మీద బస చేసేవాడు.
38 ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి పొద్దుపొద్దున్నే ఆలయానికి వచ్చేవాళ్లు.
అధస్సూచీలు
^ అక్ష., “రెండు లెప్టా.” అనుబంధం B14 చూడండి.
^ లేదా “పేదరికంలో.”
^ లేదా “తిరుగుబాట్ల.”
^ లేదా “తెగుళ్లు.”
^ లేదా “మీకు నమ్మకద్రోహం చేస్తారు.”
^ లేదా “ప్రతీకార రోజులు.”
^ అక్ష., “అన్ని.”
^ లేదా “ఉపమానం.”